Wednesday 13 February 2013

ఇదే నా మొదటి ప్రేమలేఖ....


నీకు తెలుసా ఎంత వద్దన్నా నీ చూపు
చిరుస్వరమై నా యద వీణను మీటిందని

నీకు తెలుసా కనిపించని నీకోసం నా మనసు వెతుకుతుంటే
నీ కురుల మబ్బుల పరిమళం అలవోకగా నన్ను తాకిందని

నీకు తెలుసా నీ జ్ఞాపకాల్లో నే జగం మరిస్తే
నువ్వు హరివిల్లై అంబరమెక్కి మరీ నను మేల్కొలిపావని

నీకు తెలుసా నిన్ను చూసిన మైమరుపులో వాననీటిలో నే జారిపడ్డప్పుడు
ఫక్కుమన్న నీ నవ్వుల మువ్వలు నా గుండెగదిలో పదిలమయ్యాయని

నీకు తెలుసా మన స్నేహితుని పెళ్ళి పందిట్లో నీ తల్లోంచి రాలిపడిన
మల్లెపూవు నా శ్వాసనింకా నిలిపి ఉంచిందని

నీకు తెలుసా వయసు ఆయుష్షు తనువుకే తప్ప తలపుకు కాదని
జననం మరణం మనిషికే తప్ప మనసుకు కాదని

నీకు తెలుసా చంటిపాపకైనా , శతాధికానికైనా
ప్రేమ మాత్రం పసిపాప నవ్వులాంటిదనీ , ఎన్నటికీ వాడిపోని పువ్వులాంటిదనీ

నీకు తెలుసా నీపై నా ప్రేమకు సరిగ్గా ఈ రోజుతో వసంతోత్సవమని
నీకు తెలుసా ఎందరో వెర్రివాళ్ళు ఇవాళే ప్రేమికుల దినోత్సవం అంటున్నారని

కానీ నాకు తెలుసు

ప్రేమించే మనసుంటే ప్రతి క్షణమూ పరిమళమేననీ
ప్రతి దినమూ ప్రేమకు పట్టాభిషేకమేననీ

అందుకే నా జీవంపై ఒట్టేసి చెపుతున్నా

నా ప్రేమ స్వచ్ఛమైనదైతే నువ్వెందుకు నాకు ?నీ జ్ఞాపకం చాలు
నా మమతలో నిజాయితీ ఉంటే ఈ అస్థిత్వమెందుకు నేనే నీవై ఉంటే చాలు.


Even when U have no trust - U only B in my thought & heart
as my Love is pure and sure only on YOU

Saturday 2 February 2013

//ఈ క్షణం ఒకే ఒక కోరిక....//



ఏంటో.....నాకు నేనర్ధం కాకున్నా
ఎదలో ఏం జరుగుతోందో తెలియకున్నా
ఇక్కడే ఈ ఒంటరి నిశీధిలో

నా నీడకై నే కురిసిపోతున్నా
అందని చెలిమిని అన్వేషిస్తూ...
మది ముంగిట నిలిచిపోతున్నా...


అందుకున్న చెలిమి అర్ధం వెతుకుతూ...
ఇక్కడే ఉన్నా...నిశీధి జాడనై మిగిలిపోతున్నా...

ఏదో జ్వాల ఎదలో రగులుతోంది
ముక్కలుగా తరుగుతూ మనసును
చినుకులై కురుస్తోంది కదిలే ప్రతి నిమిషమూ
చిక్కగా లోలోన కన్నీటి తెరలై
చీల్చుతోంది ప్రతి గాయాన్ని పదే పదే ప్రశ్నిస్తూ...


ఇంతలో నువ్వొచ్చావ్...చెమరించే గుండెగదికి
నవ్వుల మువ్వలు తోరణాలు కడతానంటూ...


కానీ పెరిగిన సంప్రదాయం నన్ను
కన్నీటి గడప సైతం దాటనీకుంది..
చెలిమి మధురిమ తెలియనీకుంది


ఎద వీణియ ఏ పల్లవీ నేర్వకనే మూగబోతూ.....
ఇలా...ఇలా....ఇలా....గుండెగది ని తాకిన నీ ప్రేమలా ...
ఇలా కురుస్తూ...జ్వలిస్తూ....పొగ నిట్టూరుస్తూ....


కానీ ...కానీ...నీకొకటి తెలుసా ...
ఎప్పటికీ నేను నీ చెలిమిని విడువను...
జీవితంలో ఎప్పటికైనా నీకొక్కసారి కనపడతా...

ఎప్పుడంటే ...

ఇక ఈ జీవన వేదాన్ని మోసుకెళ్ళలేని నిస్సహాయంలో
ఈ బ్రతుకు పోరాటాన్ని సాగించలేని అంగవైకల్యంలో
ఈ ఒంటరితనపు ఏకాంతాన్ని సజీవ సమాధి చేసే ఏకైక యత్నంలో

ఆఖరి శ్వాస తీసుకోవాలని నిర్ణయించుకున్న ముందురోజు

ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి....

నీ చేతి స్పర్శ తో ధైర్యం కూడగట్టుకుని
ఆనందంగా మరుజన్మ ఏదైనా ...
నిన్నే నాకు చెలిమి పిలుపుగా
ముందుగానే పరిచయించమని ఆ దైవాన్ని కోరుకుంటూ
ఆ క్షణం తలచి అపరిమితంగా సంతోషిస్తూ
తుది శ్వాసకై పరుగెడుతూ...