Thursday 31 January 2013

నీ రాక కోసం....నిలువెల్ల కనులై...

గాయమైతేనే వెదురు వీణియైందన్నావు...
అందుకేనా మరి నాకిన్నిగాయాలు చేసావు ...
కానీ నే వేణువైనా కాకున్నా..

నిశ్శబ్దానికి మువ్వలు గుచ్చావ్.....
నా ఒంటరితనానికి ఏమిచ్చావ్.....
సవ్వడెరుగని ఎద చెమ్మ తప్ప...

గాలికి సవ్వడిచ్చావ్ సరే...
మరి నా మౌనాన్నేం చేద్దామని...
నిశ్శబ్ద నిశీధిలో నిలబెట్టడం తప్ప...

మనసుకు నవ్వడం నేర్పావ్
నా కళ్ళను మర్చిపోయినట్లున్నావ్
నిదురైనా రానీకున్నావ్

నీలాగే ఆకాశానికి ఆనందమైనట్లుంది...
నిశి లేకున్నా తారలే ఏక ధారలై...
నను చీకట్లో ముంచేస్తూ

నీ చిలిపినవ్వు...నా కడ లేదు
కానీ అది  కలతలఅమాశకు లొంగదు...
సంతసాల పున్నమికి పొంగదు ..
అచ్చం నన్నూరడించే నీ
జ్ఞాపకాల ఆకశంలా..

ఏయ్ ఎక్కడున్నావ్ ఎంత పిలిచినా రాకున్నావ్!
నన్నీ నిశీధిలో ఉంచి మాయమయ్యావ్
నువ్ రానందుకే నేనే నీ దరికొస్తున్నా
సవ్వడెరుగని చిరుగాలినై...సందడించే ఎ(ద)ల పాటనై...

Thursday 24 January 2013

నీ కోసమే.....



ఆకాశరాజలక తీరినట్లుంది...
మబ్బుల పల్లకెక్కి వచ్చేసాడు..
చిలిపి తుంపర్ల తలపులు చల్లుతూ..

పాపం
పుడమి కన్య
అన్నీ మర్చిపోయినట్లుంది
వాన సరసాలు మొదలయ్యాయి

నీ అలకెప్పుడు తీరుతుంది సఖా
ఇన్ని జల్లులు పడుతున్నా
 
నా ఎద ఎంతకూ చల్లబడకుంది

నీకు తెలుసా ..కోపాల కొమ్మెక్కిన నేను
అలక తగ్గిన అలవోకనై
నీకై వేచున్నా ..నాట్యమాడని మయూరాన్నై

కలకలమై కలవరమై
నీకోసం వేచి వేగి వేసటపడిన
నాకై ఇంద్రధనుసుపై రావూ...నా మదినెరిగిపోవూ...

మర్చిపోయాను ...మరేఁ నువ్వచ్చేప్పుడు...
గతంలోని మన కలల వన్నెలు తీసుకురారాదూ
నా కలతలకు మరుపులద్ది...
నా నవ్వులకు రంగులద్ది.
నాలో  తొలిజ్ఞాపకమై మరీమరీ నిలిచిపోరాదూ....

Tuesday 22 January 2013

చైత్ర శిశిరం.....నీ వల్లే...




మామిళ్ళ మాధుర్యాన్నిచ్చే వసంతానికి తెలుసా
తనవలనే కోయిలగానాలు పుడుతున్నాయని
 
అగ్నిపూలు కురిపించే గ్రీష్మానికి తెలుసా
మల్లెపడుచు కు తానే జన్మనిచ్చానని


మేఘలేఖల్లు రాసే వర్షానికి తెలుసా
శ్రావణ వధువు తనను చూసే ముస్తాబవుతుందని

 
వెన్నెల ధాన్యాలు కొలిచే శరత్తుకి తెలుసా
తనవల్లే ఎందరో యువత అలజడితో ఒకటవుతున్నారని

 
చామంతులకు జన్మ నిచ్చే హేమంతానికి తెలుసా
భూమికి బరువయ్యేన్ని ఉసిరికలు తానే తెస్తానని

 
ఆశలమంచు ముత్యాలు రాల్చే శిశిరానికి తెలుసా
ఆకులు రాల్చినా వసంతాన్నిచ్చేది తానే అని

 
ఇన్నీ సరేగానీ నీకు తెలుసా నీ ఎడబాటు శిశిరం లో
అయినా అది నాకిపుడు ఎపుడూ అది గ్రీష్మమే అనీ....

Monday 21 January 2013

నిన్నటి నీ పరిమళం....



నిన్నటి అసంతృప్త నీడలు
నా అక్షరాలనలుముకుంటున్నాయ్
రేపటి నీ చూపు వెలుగులో
సాహిత్యాన్ని మధిస్తూ....నేను

ఏంటో నువ్వెళ్ళిపోయావ్
నిశ్శబ్దాన్ని నాలో రగిల్చి
నీ తలపులు మిగిల్చిన
విషాదం మాత్రం నాతోనే...

మది సెగలో ఆరేస్తున్నా
వెల్లువౌతున్న మమతల జడిలో
నిలువెల్లా తడిసిపోతున్న
నీ జ్ఞాపకాల పరిమళాలన్నీ

నీ అనుబంధపు మర్రిచెట్టు
నిలువెల్లా నాలో విస్తరిస్తూ
చూడు గొణుక్కుంటూనే ఉంది
కాలపు గాలికి రాలిన విషాదపు ఆకు

 సెలయేటిలో వెన్నెల దారి
బాటసారులెవరూ లేరు
పెక్కు నువ్వు లను వెతుకుతున్న
నీ ఒక్క నేను తప్ప

Friday 18 January 2013

|| ఓడిపోతున్నా... హృదయమా... మన్నించు ....||



గుండెలో భావాలన్నీ ఒలికిపోతున్నాయి
శూన్యమైపోతుందో ఏమో ఎద పాత్ర...


ఆఁ ...ఇంకా ఎక్కడుందిలే ముక్కలైపోయిందిగా..
నువ్వు చేస్తున్న జ్ఞాపకాల గాయాలతో..

అవునూ నీకు గుర్తుందా...ఇవాళ నా పుట్టిన రోజు...
నా బ్రతుకు చెట్టుకు మరో రెమ్మేసింది కానీ

నవ్వుల పూవులిస్తుందో ....కన్నీరు గాలిస్తుందో....
ఇంకా తెలియనీయని ఏకాకి తనంలో...ఇదో ఇలా

ఎందుకంటే నువు నాలో పేర్చిన నిశ్శబ్దం ఇంకా పగలకుంది...
మనసు చాలా బరువుగా దాన్ని మోస్తూనే ఉంది...

ఒకప్పుడు నా ఖాళీతనంలో నువ్వున్నావ్....
నా భావాలను అక్షయం చేస్తూ....అక్షరబద్ధం చేయిస్తూ..

ఇప్పుడూ నువ్వున్నావ్.....
నా అక్షర ముగ్ధత్వాన్ని నిశ్సబ్దంగా హెచ్చవేసి శూన్యాన్ని శేషిస్తూ ...

ఆనాడు నా పలుకులకై వగలారబోసిన నీవే...
ఈనాడు చీకటి చీర చుడుతున్నావుగా నా కనుల కన్నెకు..

ఏదేమైనా నువ్ గొప్ప కళాకారుడివే..

అరిటాకు వాక్యాల వంటి నా అనుభూతులన్నిట్నీ
నీ పలుకుల ముల్లుతో కకావికల కావ్యం చేసేసావుగా

కనుల వాకిళ్ళలో కన్నీటి అలల కళ్ళాపి చల్లుతున్నావు...
పైగా అవి నా సాంత్వనకొరకని సముదాయిస్తావు

ఏంటో ...ఈ ఎద తడిలో నీ జ్ఞాపకాల గాలి కలిసినట్లుంది..
మది మళ్ళీ వేడెక్కిపోతోంది...బ్రతుకు కల కనమంటూ

మళ్ళీ జన్మంటూ ఉంటే ఒంటరితనాన్ని సైతం
ఏకత్వమైన ఏకాంతంగా మలచమని ఆ భగవంతుణ్ణి (మళ్ళీ పురుషుడే..) ప్రార్ధిస్తూ....

Tuesday 15 January 2013

జ్ఞాపకాల వెన్నెల.....




చెలీ ! గుర్తున్నానా....
నా పక్కనుంచెళ్ళావని
పువ్వులు చెప్పాయి

నా గతం తెరిచి చూసా
మొత్తం నేనే...అందుకే ఖాళీగా...శూన్యంగా
నువ్ పరిచయమయాక
నా వర్తమానంలో నిన్ను నింపా
నిండుగా నవ్వుతోంది  రేపటి ఆశ

నిన్ను వెతుకుతూ నీ ఊరెళ్ళా
అందరూ అపరిచయస్తులే
నీ జ్ఞాపకాల వెన్నెల తప్ప

నీ తలపులతో
కాలపునావలో ప్రయాణం

ఋతువుల కన్యల పలకరింపులు
అన్నీ అనుభూతులే...అలలెక్కడా లేవు

నీకు తెలుసా ...
ఇప్పుడు లోకమంతా నిద్రిస్తోంది
నేను ...నా పుస్తకమూ
నాలో చీకటి చీల్చిన నీ పరిచయం తప్ప...

Friday 11 January 2013

ఎంకీ .....నే చూడలేనే........

వయ్యారముగా నువ్ నడుస్తు ఉంటే
ఘల్లని మ్రోగెను నీ సిరి చిరుమువ్వలు
పరవశమొందిన నా పసి మనసు నీ పారణై పులకరించెనే

అల్లి బిల్లిగా పైరగాలొకటి నీ పయ్యెదతో ఆటలాడగా
కృష్ణవేణిలా ఒంపులు తిరిగిన నడుము చూసి నే అలమటిస్తినే
నీ ఒయ్యారానికి కాపు కాస్తినే

చిగురుటాకుల చిరు చిరు పెదవుల మురిపెముగా నువ్ మాటలాడగా
నా మది నీతో సేద తీరగా చెంగున నీకై ఎగిరి వస్తినే
నీ కడ సర్వం మరచిపోతినే

కెంపుల పోటీ చేసిన చెక్కిట ఇంపుగ ఒదిగే
బుగ్గ చుక్కనై నే నిను చేరాలని ఆశపడితినే
రెండుమూరల పసుపు తాడునై నిండుగ వేసిన మూడు ముడులతో
నీ నొసటి కుంకుమై నీ సొగసుకు నే వెలుగునిస్తినే

నీ సోయగాల కాపు కాయగా నువు చుట్టుకొనే చీరనైతినే
సొబగుతొ సాగే పల్లె పదాన్నై నీ పెదవులలో ఒదిగిపోతినే

ఇంతా చేసి నిను చూడాలంటే నీ అందానికి దాసుడనైతినే
నిను చూడలేని బానిసైతినే

అందుకే నా ఎంకీ నువ్ నాకందని పాటవు నా ఆనందాల కోటవు

నేస్తం ఇయ్యవూ....


ఓయ్ నిన్నే ....నేనే పిలుస్తున్నది
నాకేఁ కొంచెం కొంచెం ఇచ్చేయవూ
కొంచెం నమ్మకం.....కాసింత ధైర్యం

కష్టాల్లోనే కాదు సుఖాల్లో సైతం
వెంట ఉంటాననే అనుభూతుల స్పర్శ

కలిమిలోనే కాదు కలతలోనూ
నా నీడ నీవే అనిపించే వెచ్చని చూపుల స్పర్శ

కొద్దిగా అంటే కొద్దిగానే ఇవ్వు ఆపై మరింత మెత్తగా నవ్వు

మాటల్ని మంత్రాల్ని చేసి అక్షరాన్ని ఆయుధంగా మలచి
కవితలలో బ్రతికేస్తాను పాటలలో వెలిగేస్తాను

అందుకే మరింతగా ఇయ్యవూ నీ చెలిమీ
అదే కదా నా కవితల వెనుక కలిమీ...

ఏయ్ నీకు తెలుసా....
నీతో నాకు చెలిముంటేనే కవిత
అది లేనపుడు నాకు నేనే ఓ కలత

చెలిమీ క్షమించవూ???


మది చివుక్కుమన్న ప్రతిసారీ నువ్ గుర్తొస్తావ్
మెల్లగా తలనిమిరే నీ చల్లని స్పర్శ గుర్తొస్తుంది
నువ్వేమైనా సాధించగలవురా అనే నీ తోడ్పాటు గుర్తొస్తుంది
పోన్లే వదిలేయ్ నీలాంటి మంచినేస్తాన్ని వదులుకోవడం
వాళ్ళ ఖర్మ బంగారూ....నువ్ వజ్రానివిరా అన్న నీ నమ్మకం గుర్తొస్తుంది...
కానీ నేను నిన్ను గాయపరిచిన క్షణాలు మాత్రం
ఎప్పుడూ గుర్తురావ్ అదేమి ఖర్మమో
అన్నిసార్లూ నవ్వుకుని మరలా నన్ను చేరదీసిన నువ్వు
ఇప్పుడు మాత్రం నన్నిలా ఒంటరిని చేసి అలిగి దూరం పోయావేమిరా?
నా కంటి చినుకై అన్ని వేళలా తోడున్న నువ్వు దూరమైతే నేనేమవాలి?
అదేంటో మరి నా కంటి కునుకూ నీకు తోడయ్యింది....
కనుల కమలాలు పత్తికాయలయ్యాయి
నా మనసు నాకు అత్తిపత్తయింది....నువ్ రావా....
నీ చెలిమిలో ఉన్న లోకం నాక్కావాలి కానీ నీ బంగారానికింకేం వద్దు...
ఏయ్ ! నా చిన్నారి నేస్తమా! రావా మరోమారు….

Monday 7 January 2013

నువ్వేనా.....నా నువ్వేనా......


ఏయ్ నేస్తం ఎలా ఉన్నావు?
నే గుర్తున్నానా అని ుండెలో గుచ్చుత
ఎప్పుడో తలవని తలంపుగా
నిర్దాక్షిణ్యంగా అడుగుతుంటావు
ఇలాంటి నిందలు పడలేకే
నిశ్సబ్దంగా నిశ్శబ్దమయింది
నా లేత మనసు.... అని నీకు తెలుసా?
నిన్ను మరువలేని క్షణాలను
మరిచిపోవాలని ఎన్ని మధురాలను
మరువనీక మరిచిపోయానో తెలుసా?
నీ తలపుల కణాలు నీ కబుర్ల క్షణాలు
నీ చేరువ క్షణాలు దూరపు మరణాలు
ఇలా నన్ను గుచ్చుతున్నవి..ఎన్నో ఎన్నెన్నో
అన్నీ దాటుకుని నువ్ లేకున్నా ....తలపుల్లోనైనా
నీ సాన్నిధ్యాన్ని అనుభూతించగల పరిణతి కోసం
ఎన్నో వేల మైళ్ళు పరుగెత్తి పరుగెత్తి డస్సిపోయాను....
మళ్ళి నీ దరికే నే వచ్చా....
అయినా ఎంతదూరం పరుగెత్తినా
నా స్నేహానివి నీవేగా....నా చెలిమి సుమానివి నీవేగా...
అందుకే నువ్ చేరువైనా దూరమైనా
నాకున్న ఏకైక నేస్తంగా నిన్నే మలుచుకుంటా
అందుకే మళ్ళి మళ్ళీ నిన్నే తలుచుకుంటా
ప్రతి ఉదయం నిన్నే పిలుచుకుంటా....

అభిసారిక




  



ఏదో మారాడాలని ఉంది..........
పెదవులు ఒణుకుతున్నాయ్ పదములు పలకకున్నాయ్

భాష రాకుంది భావాన్ని వెలికి తేకుంది
మదిలో మెదిలే మిసమిసలేవీ వెలికి రాకున్నాయ్

రెప్పవేస్తే కరిగిపోయే స్వర్గంలా నీ రూపు తోస్తోంది
ఈ క్షణం కరిగితే......ఇన్నాళ్ళ వేదనా ఎలా నివేదించనోయీ

కాలపు వేళ్ళ సందుల్లోంచి
ఈ ఘడియల్ని జారనీక పట్టుకోవాలనుంది

కానీ.......నువ్ జారిపోతున్నావ్ నా కలల్లోంచి
నీ రూపు కదిలిపోతోంది నా కనుల్లోంచి


మళ్ళీ ఎప్పుడో ఈ నిశీధికి నీ వెన్నెల రాక
అప్పటివరకూ ఈ విరహాంధకారమే శాశ్వతమిక !!

ప్రియతమా....





నిన్ను చూడాలని పరితపించే మనసును..
నాకు తెలియకుండానే నే గుప్పిటితోమూసుంచా...


నిన్ను నా దరికి తెచ్చే ఎద వాకిలిని
యాధృచ్ఛికంగానే ఎల్లప్పుడు రంగవల్లికలల్లి పరిచుంచా.....

నీ ఊసులను నాకై మోసుకొచ్చే గాలిబాలకొరకు
అదేపనిగా నా మది మందిరాలు తెరిచుంచా...


నీ మెయిల్స్ ని తీసుకొచ్చే యాహూ కోసం
సరికొత్తగా ఇంటర్ నెట్ కనెక్ట్ చేసి ఉంచా......


నీ లేఖలుంటాయి కదా అని అంతర్జాలంలో సైతం
రిజిస్టర్ చేసుకున్న పేజి కనులముందుంచా....


కానీ నువ్ రాలేదూ....నీ ఊసులూ పంపలేదు.....
అందుకే ఎడారినై వేచున్నా .....ఎద వాకిట నిలిచున్నా...


నీ పిలుపనే " స్వాతి చినుకుకై ".......
నువ్వొచ్చావనే మబ్బు తునకకై.......
ఎదురుచూపులో...ఎదురుచూస్తూ.......

ఎందుకనో నిను చూడగనే…



ఒక వసంతాన్ని లిఖించేటి
అద్భుత శిశిరంలా ఉన్నా…

నిను చూడగనే...

శీతల వనాలను దాటి
చిగురాకు భువనాల్లోకి పరుగెడుతున్నా….

చిత్రంగా నిను నాతో కొనిపోతూ ఉన్నా

నిను చూడగనే... 

మండుటెండల సైతం మురిసి
కూసే గండుకోయిలనై ఉన్నా….
అదేంటో మరి... ఆ క్షణమే..
మరు మల్లియలాంటి నీ చూపు
అలవోకగా సోకి చల్లబడుతూ ఉన్నా….


నీ మువ్వలసవ్వడి విన్నా…
ఎండిన కుహరాన్ని విడిచి
పూలగాలి రెక్కలపై తేలియాడే
తొలితుమ్మెదనౌతున్నా…


నువ్ కనపడగానే అదేంటో మరి..
నాకు నేనెపుడూ కొత్తగానే పరిచయమౌతూనే ఉన్నా…


నీ కరస్పర్శ సోకిననాడు మాత్రమే
నాకు నేను అర్థమౌతానని అనుకుంటూ ఉన్నా…


ఎప్పుడో నా ఈ చిన్ని ఎద తోటకు ఈ మరుమల్లియ రాక …..
అప్పటివరకూ వాలిన గులాబీలే నా తోటకు తోరణాలిక…..

ఎదుటా నీవే ఎదలోనా నీవే....





గుప్పిట పట్టిన వెన్నెలతో గుండె గది నిండిపోయింది
నువ్వొస్తున్నావన్న వార్తను అదింకా జీర్ణించుకోలేదు

కాని .................... అప్పుడే నువ్వొచ్చేస్తావు.
ఆకాశమంతటా నిండి ఆగిపోతావు. 

ఎక్కడో చుక్కలా  మిణుకు మిణుకుమన
మెరుస్తూ బిక్కుబిక్కుమంటున్న నా దరికి

నువ్వొచ్చేవరకూ అక్కడే ...
ఆ కలల ముంగిట్లో నిరీక్షణం



వచ్చాక వెళ్ళిపోతావేమో
అనే భయంలో బెదిరే క్షణ క్షణం


నువ్వు వచ్చేసరికి
ఆనందంతో మనసు మూగబోయింది


నువ్వు వెళ్ళక తప్పదని తెలిసేసరికి
నా కనుల వెలుగు కరిగిపొయింది.

ఇదంతా కల అని తెలిసేసరికి
కనుల ముంగిట తెల్లవారి పోయింది


ఆశల పడవ కదిలిపోయింది

పల్లవించవా నా గొంతులో....


నీ పరిచయం - ఆనందం లోని అందం చెప్పింది
నీ అనురాగం - జీవితంలోని పరిమళాలను పరిచయం చేసింది.
నీ అనుబంధం - శిలవంటి మనసుని శిల్పం చేసింది.
నీ తలపు - మది లోని వెలితిని మాయం చేసింది.
నీ వలపు - జీవితాన్ని సంపూర్ణం చేసింది.
నీ విరహం - నన్ను నాలో లేకుండా చేసింది.
ఇవన్నీ భరిస్తాను కాని
నీ వియోగం మాత్రం ............
నా ప్రాణాన్ని నాకు దూరం చేస్తుంది.
అందుకే నువ్వు మరలిపోని వసంతమై వచ్చిపో
నన్ను నాలో నింపిపో - నీవే నేనై ఉండిపో

రాకోయీ...అనుకోని అతిధీ













ఎవరు రమ్మన్నారు
నిన్ను నా చిగురాకు గూటికి..
ఎవరు చెప్పారమ్మా
నను కలవరపెట్టమని

ఎవరు పిలిచారమ్మా
నా ఎదలో కొలువుండమని
నేనంటినా నా తలపన్నదా?
ఎందుకొచ్చితివి మరి ఏల పోయితివి..
నా మనసు మధియించి ...నన్నూరడించీ
నా కలల ప్రసరించి.... నను కలతనుంచీ

నా కాలమలరించి.... బ్రతికించనెంచీ
కలకలము నుంచీ...కనుమరుగు పెంచీ..

ఎందుకొచ్చితివోయీ...ఏడ పోయితివోయి
అందుకే రాకుమా... వచ్చి వీడిపోకుమా
ఓ నా సంతసమా... నా నగవునమృతమా

Saturday 5 January 2013

మనసున మనసై....బ్రతుకున బ్రతుకై...




కనురెప్పల మైదానాల మీద
కలల విత్తనాలు జల్లి

అనుభూతుల పంట పండించింది
నీ ఆగమనం

మనసు పూదోటలో
వసంతాన్ని నెమరువేసేసి

శిశిరంలోకి నిర్దయగా
నెట్టివేసింది నీ వియోగం

ఆనాటి.... ఆ ....ఆనందం…
ఈనాటి ....ఈ ...విషాదం

ఈ రెంటి మధ్య
ఒక ఎడారి ఏకాంత వృక్షం


అదే ………. నేను ……….
నాకు మిగలని నా………అస్తిత్వం


ఈ ఏకాంత ఎడారి వృక్షానికి
నీ ఆలోచనలే ఆకులు

నీ చిలిపి నవ్వులే పూలు
మన అల్లరి ఆశలే పరిమళాలు


కానీ………..

మనసు రహదారి నిండా
శూన్యం నింపింది నీ వియోగ శిశిరం..

మళ్ళీ ఎప్పటికో
ఈ ఎడారికి (నీ) వాసంతం రాక ?

అప్పటివరకూ నా చిట్టి మనసుకు
ఈ విషాదమే శాశ్వతమిక…

రాతి(రి)పూలు

 


రాత్రి కలలో పూసిన జ్ఞాపకాల పూలు
తెల్లవారితే రాలిపోతాయేమో అన్న భయంతో
మూసిన కను రెప్పలు విడివడడం లేదు

కాని తెల్లవారింది......

కొండల చాటునుండి సూరీడు
నీ తలపుల పూతోటలోంచి ఆదమరచి మరీ
కోసుకొచ్చిన నా స్మృతుల పూలమూట
భుజాన వేసుకొని .....ఫక్కుమంటూ
బోలెడు నవ్వులతో బయటికొచ్చాడు

నిన్ను మరిచిపోదామన్న అంతరంగానికి
మరుపు వచ్చింది కానీ.....

నా పిచ్చితనం కాకపోతే నువ్వూ నేనూ
నువ్వూ- నేనైతే కదా మరిచిపోగలగడం
నువ్వే నేనైన నాడు ఏకమైన ఏకాంతం
మరిచిపోదామన్నా మరపురాని మధుర కావ్యం
అందుకే రాతిరి పూలు ....
రాతిపూలైనా పరిమళమే
ఎప్పుడు తలుచుకున్నా....
నీ జ్ఞాపకలన్నీ మధురాతి మధురమే...

Friday 4 January 2013

ఋతురాగాలు



నువ్వంటే నాకిష్టం … ఎందుకంటే …
నిన్ను చూస్తేనే "వసంతా" నికి యవ్వనం గుర్తొస్తుంది

నీ కళ్ళంటే ఇంకా బోల్డు ఇష్టం… ఎందుకంటే...
అవి చూస్తేనే "గ్రీష్మా" నికి సైతం (వా)వేడి పుడుతుంది


నీ తలపంటే నాకిష్టం… ఎందుకంటే…
అది వస్తేనే మేఘమాలకి "వ(హ)ర్ష" మై కురవాలనిపిస్తుంది


నువ్వు నవ్వుతూ వుంటే నాకిష్టం … ఎందుకంటే...
అది చూస్తేనే "శరత్తు" కి కూడా వెన్నెల పంచాలనిపిస్తుంది


నీ పలుకంటే నాకిష్టం … ఎందుకంటే…
అది వింటేనే "హేమంతా" నికి సైతం విరబూయాలనిపిస్తుంది.


నీ వియోగమంటే మాత్రం… నాకు కష్టం… ఎందుకంటే…

అప్పుడే "శిశిరం" ఆనందపు ఆకుల్ని, చిరునవ్వుల పూవుల్ని రాల్చేయడం నేర్చుకొంటుంది

అందుకే నేస్తం "శిశిరం" రాని "శరత్తు" వై నాలో నిండిపో...

"గ్రీష్మం" లేని "వసంత" మై నాతో ఉండిపో......!!!