Friday, 18 January 2013

|| ఓడిపోతున్నా... హృదయమా... మన్నించు ....||



గుండెలో భావాలన్నీ ఒలికిపోతున్నాయి
శూన్యమైపోతుందో ఏమో ఎద పాత్ర...


ఆఁ ...ఇంకా ఎక్కడుందిలే ముక్కలైపోయిందిగా..
నువ్వు చేస్తున్న జ్ఞాపకాల గాయాలతో..

అవునూ నీకు గుర్తుందా...ఇవాళ నా పుట్టిన రోజు...
నా బ్రతుకు చెట్టుకు మరో రెమ్మేసింది కానీ

నవ్వుల పూవులిస్తుందో ....కన్నీరు గాలిస్తుందో....
ఇంకా తెలియనీయని ఏకాకి తనంలో...ఇదో ఇలా

ఎందుకంటే నువు నాలో పేర్చిన నిశ్శబ్దం ఇంకా పగలకుంది...
మనసు చాలా బరువుగా దాన్ని మోస్తూనే ఉంది...

ఒకప్పుడు నా ఖాళీతనంలో నువ్వున్నావ్....
నా భావాలను అక్షయం చేస్తూ....అక్షరబద్ధం చేయిస్తూ..

ఇప్పుడూ నువ్వున్నావ్.....
నా అక్షర ముగ్ధత్వాన్ని నిశ్సబ్దంగా హెచ్చవేసి శూన్యాన్ని శేషిస్తూ ...

ఆనాడు నా పలుకులకై వగలారబోసిన నీవే...
ఈనాడు చీకటి చీర చుడుతున్నావుగా నా కనుల కన్నెకు..

ఏదేమైనా నువ్ గొప్ప కళాకారుడివే..

అరిటాకు వాక్యాల వంటి నా అనుభూతులన్నిట్నీ
నీ పలుకుల ముల్లుతో కకావికల కావ్యం చేసేసావుగా

కనుల వాకిళ్ళలో కన్నీటి అలల కళ్ళాపి చల్లుతున్నావు...
పైగా అవి నా సాంత్వనకొరకని సముదాయిస్తావు

ఏంటో ...ఈ ఎద తడిలో నీ జ్ఞాపకాల గాలి కలిసినట్లుంది..
మది మళ్ళీ వేడెక్కిపోతోంది...బ్రతుకు కల కనమంటూ

మళ్ళీ జన్మంటూ ఉంటే ఒంటరితనాన్ని సైతం
ఏకత్వమైన ఏకాంతంగా మలచమని ఆ భగవంతుణ్ణి (మళ్ళీ పురుషుడే..) ప్రార్ధిస్తూ....

Tuesday, 15 January 2013

జ్ఞాపకాల వెన్నెల.....




చెలీ ! గుర్తున్నానా....
నా పక్కనుంచెళ్ళావని
పువ్వులు చెప్పాయి

నా గతం తెరిచి చూసా
మొత్తం నేనే...అందుకే ఖాళీగా...శూన్యంగా
నువ్ పరిచయమయాక
నా వర్తమానంలో నిన్ను నింపా
నిండుగా నవ్వుతోంది  రేపటి ఆశ

నిన్ను వెతుకుతూ నీ ఊరెళ్ళా
అందరూ అపరిచయస్తులే
నీ జ్ఞాపకాల వెన్నెల తప్ప

నీ తలపులతో
కాలపునావలో ప్రయాణం

ఋతువుల కన్యల పలకరింపులు
అన్నీ అనుభూతులే...అలలెక్కడా లేవు

నీకు తెలుసా ...
ఇప్పుడు లోకమంతా నిద్రిస్తోంది
నేను ...నా పుస్తకమూ
నాలో చీకటి చీల్చిన నీ పరిచయం తప్ప...

Friday, 11 January 2013

ఎంకీ .....నే చూడలేనే........

వయ్యారముగా నువ్ నడుస్తు ఉంటే
ఘల్లని మ్రోగెను నీ సిరి చిరుమువ్వలు
పరవశమొందిన నా పసి మనసు నీ పారణై పులకరించెనే

అల్లి బిల్లిగా పైరగాలొకటి నీ పయ్యెదతో ఆటలాడగా
కృష్ణవేణిలా ఒంపులు తిరిగిన నడుము చూసి నే అలమటిస్తినే
నీ ఒయ్యారానికి కాపు కాస్తినే

చిగురుటాకుల చిరు చిరు పెదవుల మురిపెముగా నువ్ మాటలాడగా
నా మది నీతో సేద తీరగా చెంగున నీకై ఎగిరి వస్తినే
నీ కడ సర్వం మరచిపోతినే

కెంపుల పోటీ చేసిన చెక్కిట ఇంపుగ ఒదిగే
బుగ్గ చుక్కనై నే నిను చేరాలని ఆశపడితినే
రెండుమూరల పసుపు తాడునై నిండుగ వేసిన మూడు ముడులతో
నీ నొసటి కుంకుమై నీ సొగసుకు నే వెలుగునిస్తినే

నీ సోయగాల కాపు కాయగా నువు చుట్టుకొనే చీరనైతినే
సొబగుతొ సాగే పల్లె పదాన్నై నీ పెదవులలో ఒదిగిపోతినే

ఇంతా చేసి నిను చూడాలంటే నీ అందానికి దాసుడనైతినే
నిను చూడలేని బానిసైతినే

అందుకే నా ఎంకీ నువ్ నాకందని పాటవు నా ఆనందాల కోటవు

నేస్తం ఇయ్యవూ....


ఓయ్ నిన్నే ....నేనే పిలుస్తున్నది
నాకేఁ కొంచెం కొంచెం ఇచ్చేయవూ
కొంచెం నమ్మకం.....కాసింత ధైర్యం

కష్టాల్లోనే కాదు సుఖాల్లో సైతం
వెంట ఉంటాననే అనుభూతుల స్పర్శ

కలిమిలోనే కాదు కలతలోనూ
నా నీడ నీవే అనిపించే వెచ్చని చూపుల స్పర్శ

కొద్దిగా అంటే కొద్దిగానే ఇవ్వు ఆపై మరింత మెత్తగా నవ్వు

మాటల్ని మంత్రాల్ని చేసి అక్షరాన్ని ఆయుధంగా మలచి
కవితలలో బ్రతికేస్తాను పాటలలో వెలిగేస్తాను

అందుకే మరింతగా ఇయ్యవూ నీ చెలిమీ
అదే కదా నా కవితల వెనుక కలిమీ...

ఏయ్ నీకు తెలుసా....
నీతో నాకు చెలిముంటేనే కవిత
అది లేనపుడు నాకు నేనే ఓ కలత

చెలిమీ క్షమించవూ???


మది చివుక్కుమన్న ప్రతిసారీ నువ్ గుర్తొస్తావ్
మెల్లగా తలనిమిరే నీ చల్లని స్పర్శ గుర్తొస్తుంది
నువ్వేమైనా సాధించగలవురా అనే నీ తోడ్పాటు గుర్తొస్తుంది
పోన్లే వదిలేయ్ నీలాంటి మంచినేస్తాన్ని వదులుకోవడం
వాళ్ళ ఖర్మ బంగారూ....నువ్ వజ్రానివిరా అన్న నీ నమ్మకం గుర్తొస్తుంది...
కానీ నేను నిన్ను గాయపరిచిన క్షణాలు మాత్రం
ఎప్పుడూ గుర్తురావ్ అదేమి ఖర్మమో
అన్నిసార్లూ నవ్వుకుని మరలా నన్ను చేరదీసిన నువ్వు
ఇప్పుడు మాత్రం నన్నిలా ఒంటరిని చేసి అలిగి దూరం పోయావేమిరా?
నా కంటి చినుకై అన్ని వేళలా తోడున్న నువ్వు దూరమైతే నేనేమవాలి?
అదేంటో మరి నా కంటి కునుకూ నీకు తోడయ్యింది....
కనుల కమలాలు పత్తికాయలయ్యాయి
నా మనసు నాకు అత్తిపత్తయింది....నువ్ రావా....
నీ చెలిమిలో ఉన్న లోకం నాక్కావాలి కానీ నీ బంగారానికింకేం వద్దు...
ఏయ్ ! నా చిన్నారి నేస్తమా! రావా మరోమారు….

Monday, 7 January 2013

నువ్వేనా.....నా నువ్వేనా......


ఏయ్ నేస్తం ఎలా ఉన్నావు?
నే గుర్తున్నానా అని ుండెలో గుచ్చుత
ఎప్పుడో తలవని తలంపుగా
నిర్దాక్షిణ్యంగా అడుగుతుంటావు
ఇలాంటి నిందలు పడలేకే
నిశ్సబ్దంగా నిశ్శబ్దమయింది
నా లేత మనసు.... అని నీకు తెలుసా?
నిన్ను మరువలేని క్షణాలను
మరిచిపోవాలని ఎన్ని మధురాలను
మరువనీక మరిచిపోయానో తెలుసా?
నీ తలపుల కణాలు నీ కబుర్ల క్షణాలు
నీ చేరువ క్షణాలు దూరపు మరణాలు
ఇలా నన్ను గుచ్చుతున్నవి..ఎన్నో ఎన్నెన్నో
అన్నీ దాటుకుని నువ్ లేకున్నా ....తలపుల్లోనైనా
నీ సాన్నిధ్యాన్ని అనుభూతించగల పరిణతి కోసం
ఎన్నో వేల మైళ్ళు పరుగెత్తి పరుగెత్తి డస్సిపోయాను....
మళ్ళి నీ దరికే నే వచ్చా....
అయినా ఎంతదూరం పరుగెత్తినా
నా స్నేహానివి నీవేగా....నా చెలిమి సుమానివి నీవేగా...
అందుకే నువ్ చేరువైనా దూరమైనా
నాకున్న ఏకైక నేస్తంగా నిన్నే మలుచుకుంటా
అందుకే మళ్ళి మళ్ళీ నిన్నే తలుచుకుంటా
ప్రతి ఉదయం నిన్నే పిలుచుకుంటా....

అభిసారిక




  



ఏదో మారాడాలని ఉంది..........
పెదవులు ఒణుకుతున్నాయ్ పదములు పలకకున్నాయ్

భాష రాకుంది భావాన్ని వెలికి తేకుంది
మదిలో మెదిలే మిసమిసలేవీ వెలికి రాకున్నాయ్

రెప్పవేస్తే కరిగిపోయే స్వర్గంలా నీ రూపు తోస్తోంది
ఈ క్షణం కరిగితే......ఇన్నాళ్ళ వేదనా ఎలా నివేదించనోయీ

కాలపు వేళ్ళ సందుల్లోంచి
ఈ ఘడియల్ని జారనీక పట్టుకోవాలనుంది

కానీ.......నువ్ జారిపోతున్నావ్ నా కలల్లోంచి
నీ రూపు కదిలిపోతోంది నా కనుల్లోంచి


మళ్ళీ ఎప్పుడో ఈ నిశీధికి నీ వెన్నెల రాక
అప్పటివరకూ ఈ విరహాంధకారమే శాశ్వతమిక !!