Friday 18 January 2013

|| ఓడిపోతున్నా... హృదయమా... మన్నించు ....||



గుండెలో భావాలన్నీ ఒలికిపోతున్నాయి
శూన్యమైపోతుందో ఏమో ఎద పాత్ర...


ఆఁ ...ఇంకా ఎక్కడుందిలే ముక్కలైపోయిందిగా..
నువ్వు చేస్తున్న జ్ఞాపకాల గాయాలతో..

అవునూ నీకు గుర్తుందా...ఇవాళ నా పుట్టిన రోజు...
నా బ్రతుకు చెట్టుకు మరో రెమ్మేసింది కానీ

నవ్వుల పూవులిస్తుందో ....కన్నీరు గాలిస్తుందో....
ఇంకా తెలియనీయని ఏకాకి తనంలో...ఇదో ఇలా

ఎందుకంటే నువు నాలో పేర్చిన నిశ్శబ్దం ఇంకా పగలకుంది...
మనసు చాలా బరువుగా దాన్ని మోస్తూనే ఉంది...

ఒకప్పుడు నా ఖాళీతనంలో నువ్వున్నావ్....
నా భావాలను అక్షయం చేస్తూ....అక్షరబద్ధం చేయిస్తూ..

ఇప్పుడూ నువ్వున్నావ్.....
నా అక్షర ముగ్ధత్వాన్ని నిశ్సబ్దంగా హెచ్చవేసి శూన్యాన్ని శేషిస్తూ ...

ఆనాడు నా పలుకులకై వగలారబోసిన నీవే...
ఈనాడు చీకటి చీర చుడుతున్నావుగా నా కనుల కన్నెకు..

ఏదేమైనా నువ్ గొప్ప కళాకారుడివే..

అరిటాకు వాక్యాల వంటి నా అనుభూతులన్నిట్నీ
నీ పలుకుల ముల్లుతో కకావికల కావ్యం చేసేసావుగా

కనుల వాకిళ్ళలో కన్నీటి అలల కళ్ళాపి చల్లుతున్నావు...
పైగా అవి నా సాంత్వనకొరకని సముదాయిస్తావు

ఏంటో ...ఈ ఎద తడిలో నీ జ్ఞాపకాల గాలి కలిసినట్లుంది..
మది మళ్ళీ వేడెక్కిపోతోంది...బ్రతుకు కల కనమంటూ

మళ్ళీ జన్మంటూ ఉంటే ఒంటరితనాన్ని సైతం
ఏకత్వమైన ఏకాంతంగా మలచమని ఆ భగవంతుణ్ణి (మళ్ళీ పురుషుడే..) ప్రార్ధిస్తూ....

3 comments:

  1. వేదనని కూడా ఇంతందంగా చెప్పాలా!

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందనే విషయం ఇంతానందాన్నియ్యాలా!! థేంక్యూ పద్మా జీ...

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete